Friday, July 17, 2009

‘సంకట్ సిటీ’ ఒక చీకటి కోణం


ఈ మధ్యకాలంలో కొందరు నటులుంటే చాలు ఆ సినిమా బాగానే ఉంటుంది అని నమ్మెయ్యదగ్గ “నమ్మకం” సంపాదించుకున్న నటుల్లో బాలీవుడ్ నటుడు కేకే(మీనన్) ఒకరు. హఠాత్తుగా ఒక పోస్టర్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా ‘సిన్ సిటీ’ తరహాలో ఉందే అనుకుంటే ఆ సినిమా పేరే ‘సంకట్ సిటీ’ అని కనిపించింది. ఆ పోస్టర్ పైన కేకే బొమ్మ. ఇంకేం సినిమా చూసెయ్యాలని డిసైడ్ అయ్యాను. చూశాను.

ఇదొక వెధవ సినిమా. సినిమాలో కనిపించే ప్రతిపాత్రా వెధవ పాత్ర. చేసే ప్రతి చర్యా వెధవ చర్య. అయ్యే ప్రతి ప్రతిచర్యకూ ఒక వెధవ పర్యవసానం. మొత్తంగా పడీపడీ నవ్వుకునే వెధవాతివెధవ సినిమా.

ఇదేమిటీ ఇన్ని వెధవలు వాడేసాడు అనుకోకండి. ఆ “వెధవ” పదం నెగిటివ్ గా వాడటం లేదు. సీరియస్గానే ఒదొక చీకటి బ్రతుకుల సినిమా. దొంగలు, దొంగస్వాములు, దొంగ బిల్డర్లు, దొంగ ఫైనానసర్లూ, దొంగ ఫిల్మ్ మేకర్లూ వాళ్ళనే మోసం చేసే మంచి దొంగలు, పిరికి దొంగలు, ఒక ఫ్రొఫెషనల్ హంతకుడు ఉన్న సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచీ అంతం వరకూ అన్నీ అవకతవకలే జరిగే సినిమా ఇది.

డబ్బులు చేతులు మారటాలు. బ్యాగులూ, సూట్ కేసులు తారుమారవటాలు. కార్ల దొంగతనాలు. తలకు దెబ్బతగిలి ఉన్నమతి పోవటాలు. చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ముళ్ళు కలవటాలు. అన్ని రెగ్యులర్ సినిమా మసాలాలూ పిచ్చెక్కించేలా పిచ్చిపిచ్చిగా అల్లేసి ఒక బ్లాక్ కామెడీని సృష్టించేశాడు దర్శకుడు. సినిమాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ ఏ మలుపులో అలా జరుగుతుందో ఎదురుచూస్తూ మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆ జరుగుతున్నది పూర్తిగా అసంబద్ధం అని మనకు తెలుసు. కానీ, ఆ అసంబద్ధతలోని నిబద్ధతని చూసి మురిసిపోవచ్చు.

కొన్ని సినిమాలకు మెదడు ధియేటర్ బయట వదిలి వెళ్ళాలంటారు. ఈ సినిమాలో మెదడు తల్లోపెట్టుకునే, మెదడు అవసరం లేని మెదడుకలిగిన సినిమా చూడొచ్చు. చిత్రంగా ఉందికదా! అదే ఈ సినిమా విచిత్రం. ఇదొక ఘాట్ రోడ్డు ప్రయాణం లాంటి సినిమా ఎవరో చెప్పినట్లు “మలుపు మలుపులోనూ ట్విస్ట్” ఉన్న సినిమా ఇది.

అనుపమ్ ఖేర్ లో చూపించడానికి ఇంకా కొత్తగా ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఈ సినిమా ఋజువు చేస్తుంది. రిమీ సేన్ (?) కూడా పాత్రకుతగ్గ నటన చేసింది. ప్రభవల్కర్ నటన సహజంగా ఉంది. చంకీపాండే ఫరవాలేదనిపించాడు. హీరో గెటప్ లో కన్నా, హైదరాబాదీ డుప్లికేట్ గా మంచి నటన చూపాడు.
దర్శకుడు పంకజ్ అద్వానీ గురించి పెద్ధగా తెలీదుగానీ, త్వరలోనే Most Wanted దర్శకుడు అయ్యే లక్షణాలు కనిపిస్తాయి. వెధవతనంలో సిన్సియారిటీ చూపే దర్శకులు మనకున్నారుగానీ, వెధవతనాన్ని ఇంత మెదడుతో మనోరంజకంగా తెరకెక్కించిన దర్శకుడిగా ఖచ్చితంగా మెప్పు పొందుతాడు. ఖోస్లా కా ఘోస్లా, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ దర్శకుడు దిబాకర్ బెనర్జీ తరహా పరిణితి కనిపిస్తుంది.

ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని నేను చెప్పనుగానీ, చూడకపోతే మాత్రం బాలీవుడ్ కొత్తతరహా సినిమాలకు శ్రీకారం ఎలా చుడుతోందే తెలుసుకునే ఒక లంకెతో మీరు పరిచయం కోల్పోతారు. కాబట్టి నిర్ణయం మీదే!

*****

1 comments:

Anonymous said...

thanks for your review .. ఒక worth DVD కొనిపించారు ..